కరీంనగర్ శ్రీచైతన్య కాలేజీలో దొంగతనం.. నిందితుడు అరెస్ట్
- కరీంనగర్ లోని శ్రీచైతన్య కాలేజీలో నిన్న తెల్లవారుజామున దొంగతనం
- రూ. 5 లక్షల నగదు, బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన బొద్దుల యుగేందర్
- దొంగిలించిన డబ్బు, గొలుసును స్వాధీనం చేసుకున్న పోలీసులు
కరీంనగర్ లోని మంకమ్మతోట ప్రాంతంలో ఉన్న శ్రీచైతన్య కాలేజీలో దొంగతనం జరిగింది. ఈ చోరీని పోలీసులు ఛేదించారు. జల్సాల కోసం దొంగతనాలకు అలవాటు పడి, విద్యా సంస్థలనే లక్ష్యంగా చేసుకుంటున్న పాత నేరస్తుడు బొద్దుల యుగేందర్ను కరీంనగర్ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ సీపీ గౌస్ ఆలం ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.
ఏప్రిల్ 26వ తేదీ తెల్లవారుజామున మంకమ్మతోటలోని శ్రీ చైతన్య కాలేజీ ఆఫీసు తాళాలు పగులగొట్టిన నిందితుడు, బీరువాలో ఉన్న రూ. 5 లక్షల నగదు, ఒక బంగారు గొలుసును ఎత్తుకెళ్లాడు. దొంగిలించిన సొత్తును ఎవరికీ అనుమానం రాకుండా తన ఇంటి వెనుక ఉన్న కట్టెల కుప్పలో దాచిపెట్టాడు. పోలీసులు పక్కా సమాచారంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని, దొంగిలించిన రూ. 5 లక్షల నగదును, 10 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు.